ఈ రకమైన చింతనతో
మనస్తత్వ శాస్త్రంలో నా పురోగమనం ఓ కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. అప్పట్నుంచి కలలలోని
కేంద్ర భావన నుండి మారీ దూరంగా తీసుకుపోయే “స్వేచ్ఛానుసంధానా”లని అనుసరించడం మానేశాను.
కల నుండి దూరంగా పోతూ, కలలో లేని దాన్ని అల్లుకుపోవడం కన్నా, కేవలం కల మీద కేంద్రీకరించి
కల ఏం చెప్తుందో చూడాలని నిశ్చయించుకున్నాను. అలా
చేసినప్పుడు కల ద్వార అచేతన మనకు ఏం చెప్పాలని చూస్తోందో అర్థమవుతుందని అనిపించింది.
కల పట్ల ఈ విధంగా
నా దృక్పథం మారాక కలలని విశ్లేషించే విధానం కూడా క్రమంగా మార్చుకున్నాను. ఈ కొత్త పద్ధతితో
కలల యొక్క వివిధ ముఖాలని క్షుణ్ణంగా విశ్లేషించడానికి వీలయ్యింది. సచేతన మనసు చెప్పే
కథకి ఓ ఆది, ఓ క్రమం, ఓ అంతం ఉంటాయి. కాని
కలకి అలాంటివేం ఉండవు. దేశకాలాలలో కల యొక్క అమరిక చాలా భిన్నంగా ఉంటుంది. ఒక వస్తువుని
క్షుణ్ణంగా పరిశీలించాలంటే దాన్ని చేతిలో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ అన్ని కోణాల నుంచి
చూస్తాము. అలాగే కలని అర్థం చేసుకోవాలంటే దాన్ని పలు కోణాల నుండి చూడాలి.
ఇవన్నీ ఎందుకు
చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రాయిడ్ వాడిన ‘స్వేచ్ఛానుసంధాన” పద్ధతి పట్ల
నాకు విముఖత ఎలా పెరిగిందో చెప్పుకోవడమే నా ఉద్దేశం. కల నుండి బయల్దేరి ‘స్వేచ్ఛానుసంధానం’
పేరుతో ఇష్టమొచ్చినట్టు ఊహాగానాలు అల్లడం నాకు మంచిది కాదనిపించింది. అందుకు బదులుగా
వీలైనంత వరకు కలకే పరిమితమై వుండాలి, కలకి సన్నిహితంగా ఉండాలి. నిజమే స్వేచ్ఛానుసంధానాలని
జాగ్రత్తగా అనుసరిస్తే రోగి యొక్క మానసిక సంక్లిష్టాలని కనిపెట్టొచ్చు. కాని నా ఉద్దేశంలో
అంతకన్నా లోతైన లక్ష్యం ఒకటుంది. కేవలం మానసిక సంక్లిష్టాలని కనిపెట్టడమే ఉద్దేశం అయితే
అందుకు మరెన్నో పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇందుకోసం ‘పదానుసంధాన
పరీక్షలు’ (word-association tests) వాడుతారు.
ఈ పరీక్షల్లో రోగికి కొన్ని పదాలు చూపించి ఆ పదాలు రోగి మనసులో ఎలాంటి భావాలు స్ఫురింపజేస్తున్నాయో
ఏకరువు పెట్టమంటారు. అలా పెడుతున్నప్పుడు రోగి మనసులో, అచేతనలో ఏం దాగి వుందో బయటపడుతుంది.
ఒక వ్యక్తి యొక్క అంతర్యాన్ని, అంతర్వ్యక్తిని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే, ఆ ప్రయత్నంలో
ఆ వ్యక్తి యొక్క కలలు, కలలు ప్రదర్శించే ప్రతీకలు ఎంతో దొహదం చేస్తాయి.
ఉదాహరణకి లైంగిక
చర్యని ప్రతీకాత్మకంగా వ్యక్తం చెయ్యడానికి ఎంతో వైవిధ్యం గల ప్రతీకలని, చిత్రాలని
వాడుకోవచ్చని అందరికీ తెలిసిందే. ఆ ప్రతీకలు చూపిస్తున్న ఆలవాళ్ల వెంబడి ‘అనుసంధాన’
పద్ధతిలో వెతుక్కుంటూ పోతే రోగి యొక్క లైంగిక భావాల గురించి, ఆ భవాలలో వేళ్లూని వున్న
మానసిక సంక్లిష్టాల గురించి తెలుసుకునే అవకాశం వుంది. కాని విషయం ఏంటంటే అలాంటి సంక్లిష్టాలని
వెలికి తీయడానికి లైంగిక చిత్రాలే అక్కర్లేదు. ఏదో అజ్ఞాత లిపికి చెందిన అక్షరాలని
ధ్యానిస్తూ ఏదో పగటి కలలోకి జారుకున్న స్థితిలో కూడా సంక్లిష్టాలని కనిపెట్టొచ్చు.
ఇలాంటి తార్కాణాలు చూశాక నేనో నిర్ణయానికి వచ్చాను. కలల మనకిచ్చే సందేశం కేవలం ఒక లైంగిక
ఉపమాలంకారం కాదు. కలలలో అంతకన్నా విలువైన సారం ఎంతో ఉంటుంది అనిపించింది.
ఈ విషయాన్ని సోహరణంగా వివరిస్తాను. ఉదాహరణకి ఓ తాళం
కప్పలో తాళం చెవి తిప్పినట్టో, ఓ ధృఢమైన కర్రని
విసిరినట్టో, ఓ పెద్ద దుంగతో ఓ బలమైన ద్వారాన్ని బద్దలు కొట్టినట్టో కల వచ్చిందని అనుకోండి.
ఈ చిత్రాలన్నిటినీ లైంగిక ఉపమాలంకారాలుగా పరిగణించొచ్చు. కాని ఒక వ్యక్తిలో అతడి అచేతన
వీటిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతీకను మాత్రమే ఎందుకు ఎంచుకుంది? ఒక వ్యక్తి తాళం చెవి గురించి
కల గంటాడు, కర్ర గురించి కలగనడు. మరో వ్యక్తి బలమైన దుంగని కల గంటాడు, అతడి కలలో తాళం
చెవి కనిపించదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే కలలో మనం చూడాల్సింది లైంగిక
విషయాన్ని కాదు. కల నుండి మనం అర్థం చేసుకోవాల్సినది మరింకేదో వుంది.
ఈ విధంగా ఆలోచిస్తూ
నేనో అవగాహనకి వచ్చాను. కలలో అత్యంత స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఉన్న అంశాలనే మనం అన్వయానికి
వాడుకోవాలి. కలలతో ఓ చిక్కుంది. కలలతో ఒక విధంగా వ్యవహరిస్తూ మనం కల నుండి దూరంగా పోతాం.
మరో రకంగా వ్యవహరిస్తే కల యొక్క సారాన్ని తాకుతాం. “స్వేచ్ఛానుసంధాన” పద్ధతి మనని జిగిబిగి
గతిలో కల నుండి దూరంగా తీసుకుపోతుంది. కాని నేను రూపొందించిన పద్ధతి కల చుట్టూ ప్రదక్షిణ
చేయిస్తూ కల యొక్క కేంద్రానికి తీసుకుపోతుంది. తన కలని వర్ణిస్తున్నప్పుడు స్వాప్నికుడు
(కల గన్నవాడు) ఒక్కోసారి కల నుండి దూరంగా వెళ్లిపోతుంటాడు. అలా వెళ్లీ పోయే ధోరణి కనిపించినప్పుడల్లా
నేను తిరిగి అతణ్ణి కల వద్ద ఈడుస్తుంటాను. నా వద్దకి వచ్చిన రోగులతో నేను ఎన్నో సార్లు
అంటుంటాను, “మళ్లీ మీ కల వద్దకే వద్దాం. సరిగ్గా మీ కల ఏం చెప్తోందో చెప్పండి.”
ఉదాహరణకి ఒక
సారి ఒక రోగి చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో, తప్పతగి వున్న ఓ స్త్రీ గురించి కల
గన్నాడు. ఈ కలలో ఆ స్త్రీ అతడి భార్య అనిపించింది అతడికి. కాని వాస్తవంలో అతడి భార్య
అందుకు పూర్తిగా భిన్నంగా వుంటుంది. కనుక పైపైన చూస్తే ఆ కల వట్టి కల్ల అని కొట్టిపారేయాల్సి
ఉంటుంది. కలలలో ఎప్పుడూ కనిపించే చెత్తే ఇదీను అని రోగి దాన్ని త్రోసిపుచ్చాడు మొదట్లో.
ఒక డాక్టరుగా నేను రోగిని అనుసంధాన పద్ధతిని వాడి కలని అన్వయించడానికి ప్రయత్నించమని
ప్రోత్సహించి వుంటే అతగాడు ఆ అప్రియమైన కల నుండి వీలైనంత దూరంగా తొలగిపోయి వుండేవాడు.
తన భార్యతో సంబంధం లేని ఏదో అసంబంధమైన మానసిక సంక్లిష్టతని చేరుకునే వాడు. అందువల్ల
ఈ కల గురించి ప్రత్యేకించి మనకి అర్థమయ్యేదేమీ వుండదు.
(ఇంకా వుంది)
తెలుగులో సైకాలజీ గురించి చాలా చక్కగా వివరించారు. మరిన్ని మంచి వ్యాసాలు అందించగలరు
Thank you. BTW ఇది Carl Jun రాసిన Approaching the Unconscious అనే book chapter కి అనువాదం.
సిగ్మాండ్ ప్రాయిడ్ మనస్తత్వ శాస్త్రం పూర్తిగా శాస్త్రియం కాదని, ఒక వ్యక్తి మస్తత్వం వెనుక సామజిక కారణాలు వుంటాయని అంటారు. ఎంత వరకు నిజమంటారు.