మామయ్య ఆ అక్షరాల కేసి కళ్లజోడు సర్దుకుని తదేకంగా చూశాడు.
“ఇవి రూనిక్ అక్షరాలే. స్నోర్ టరెల్సన్ వ్రాసిన వ్రాతప్రతి లోని అక్షరాల మాదిరిగానే ఉన్నాయి. కాని ఇంతకీ వాటి అర్థం ఏమిటి?”
చిచిత్ర విచిత్రంగా మెలికలు తిరిగిపోతున్న ఆ అక్షరాలని చూస్తే అవి కచ్చితంగా అమాయక ప్రజలని తికమక పెట్టటానికి ఎవరో తెలివైన వాళ్లు పన్నిన పన్నాగం అనిపించింది నాకైతే.
“ఇది నిజంగా ప్రాచీన ఐస్లాండిక్ భాషే,” గొణుగుతున్నట్టుగా అన్నాడు మామయ్య.
చెప్పలేదు కదూ? మా మామయ్య బహుభాషా కోవిదుడు. అంటే భూమి మీద ఉండే రెండు వేల భాషలూ, పన్నెండు వేళ మాండలికాలూ అన్నీ ఆయనకి వచ్చని అనటం లేదు. భాషలలో ఆయనకి లోతైన పరిజ్ఞానం ఉందని మాత్రం విన్నాను.
ఇక ఏ క్షణం మిన్ను విరిగి మీద పడుతుందో నని భయపడుతున్న సమయంలో గడియారం రెందు కొట్టింది. అంతలో మార్తా తలుపు తెరిచి,
“భోజనం తయార్!” అని ఎలుగెత్తి చాటింది.
వేడి వేడి సూప్ ఆయన బల్ల మీద పెట్టి మార్తా చల్లగా జారుకుంది. నేను కూడా అక్కణ్ణుంచి మెల్లగా బయటపడి డైనింగ్ రూం కి వెళ్లి నేను ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను.
కాసేపు ఎదురు చూసాను. మామయ్య రాలేదు. ఎంత పనిలో ఉన్నా భోజనం వేళకి మాత్రం వచ్చి అందరితో తినే అలవాటు ఉంది మామయ్యకి. పైగా ఈ రోజు భోజనం మరీ ఘుమ ఘుమ లాడుతోంది. పార్స్లే సూప్, సారెల్ ఆకులు అందంగా చల్లిన ఆంలెట్, కమ్మని లేడి మాంసం ... ఒకటా రెండా, వివాహ భోజనంలా నోరూరిస్తోంది.
మామయ్య ఎంతకీ రాడే! నిశ్చయంగా ఆ చిత్తు కాగితం మోజులో పడ్డాడు! మరేం చెయ్యను? ఒక బాధ్యత గల మేనల్లుడిగా ఆయన వంతు, నా వంతు కూడా నేనే తినటానికి ఉపక్రమించాను.
“భోజనం వేళకి అయ్యగారు రాకపోవటం ఇదే మొదటి సారి,” మార్తా అంది కంగారుగా.
“నిజమే నాకూ అర్థం కావటం లేదు,” నోట్లో ఉన్న పదార్థాన్ని అటు ఇటు సర్దుకుంటూ ఇబ్బందిగా అన్నాను.
“ఇవాళ ఏదో ఉపద్రవం జరగబోతోంది,” మార్తా మళ్లీ అంది భయంగా.
ఆయన వంతు భోజనం కూడా నేనే తినేశానని మా మామయ్యకి తెలిస్తే, ఈ ప్రపంచంలో అంతకన్నా ఉపద్రవం మరేదీ ఉండదు. అంతలో భీకరంగా మరో కేక వినిపిస్తే నోట్లో పెట్టుకోబోతున్న ఐస్క్రీం ని అలాగే వొదిలేసి దిగ్గున లేచాను.
అయస్కాంతం వైపు దూసుకుపోతున్న ఇనుప రజనులా మామయ్య స్టడీ రూం వైపుగా దూసుకుపోయాను.
(ఈ ' సీరియల్ ' (ప్రస్తుతానికి) సమాప్తం)
ayyo.
Hi నాగప్రసాద్,
తెలుగులో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం. మిమ్మల్ని కలవాలి అంటే ఎలా? (email id ??)
అజ్ఞాత గారు, నా email ID: nagaprasad27@gmail.com. స్పందించినందుకు ధన్యవాదాలు.
Super narration very very nice.