కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 11
ఆధునిక వాతావరణ నమూనాలు ఎలా పని చేస్తాయో ఓసారి చూద్దాం. రమారమి అరవై మైళ్ళ సమమైన ఎడం ఉన్న స్థానాలతో భూమి అంతా విస్తరించిన ఓ ఊహాత్మక గడిని తీసుకుంటారు. ప్రతీ స్థానంలోని వాతావరణాన్ని గురించిన సమాచారం పృథ్వీ కేంద్రాల నుండి, ఉపగ్రహాల నుండి వస్తుంది. అయితే కొన్ని కొన్ని స్థానాల నుండి - కేంద్రాలు లేకపోవడం చేతగాని మరే కారణం చేతగాని సమాచారం లభించకపోవచ్చు. అటువంటప్పుడు పొరుగుస్థానాలలో నమోదు అయిన సమాచారం బట్టి ఇక్కడి సమాచారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ అంచనాల్లో దోషాల వల్ల వాతావరణ నిర్ణయంలో తప్పులు దొర్లుతాయి. ఆరంభస్థితిలో ఎంత దోషం ఉంటే భవిష్యత్ స్థితిలో అంత దోషం వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ ఆరంభ స్థితి గురించి చాలా కచ్చితమైన సవివరమైన సమాచారం దొరికిందని అనుకుందాం. అంటే భూమి మొత్తాన్ని ఒక అడుగు పరిమాణం ఉన్న చదరపు గడితో నింపేసి, అలాగే ఊర్థ్వ దిశలో కూడా వాతావరణపు పైపొర వరకు ఒక్కొక్క అడుగునా సమాచారం దొరికింది అనుకున్నాం. అసలు అంత వివరమైన సమాచారం కావాలంటే ఎన్ని ఉపగ్రహాలు, ఎన్ని వాతావరణ కేంద్రాలు కావాలో చెప్పలేం. పోనీ అవన్నీ ఉన్నాయనుకుందాం. అంత సమాచారమూ ఒక ప్రత్యేకమైన రోజు మధ్యాహ్నం 12 గంటలకి దొరికింది అనుకుందాం. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని 12.01కి, 12.02కి, 12.03...ఇలా వరుసగా నిముష నిముషానికి వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పగలమా?
చెప్పలేం. మీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం అదే. అంత సమాచారం ఉన్నా కూడా ఉదాహరణకి వచ్చే నెల ఒకటో తారీఖున ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు ఉంటుందా లేదా అని అడిగితే కంప్యూటర్ చెప్పలేకపోవచ్చు. ఏం, ఎందుకని? అరవై మైళ్ళ ఎడం ఉన్నప్పటి కన్నా అడుగు ఎడం ఉన్నప్పుడైతే నమోదు అయిన వాతావరణ సమాచారంలో దోషం తక్కువగా ఉంటుంది నిజమే. కాని అసలు దోషమే ఉండదని కాదుగా. వాతావరణ పరిణామం తీరు అత్యంత సంక్లిష్టంగా ఉండడం చేత ఆ అతి స్వల్ప దోషం కూడా ఇట్టే విస్తరించి, "ఇంతింతై" అన్నట్టు పెరిగిపోతుంది. ఓ వారం రోజుల తరువాత గగనంలో ఏం జరుగుతుందో చెప్పడం గగనం అయిపోతుంది. దీనికే "తూనీగ న్యాయం"
అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. మన పెరట్లో తూనీగ రెక్కలు అల్లారిస్తే ఎక్కడో బ్రహ్మపుత్రలో వరదలొచ్చాయట! అతి స్వల్ప కారణం పెరిగి పెచ్చరిల్లి పెనుఫలితానికి దారి తీయడమే ఈ తూనీగ న్యాయం. వాతావరణ పరిణామంలో ఉండే సంధిగ్ధతలకి అద్దం పడుతుందీ న్యాయం.
తక్కిన వ్యవస్థల్లోలా కాక వాతావరణం విషయంలో అలా స్వల్ప దోషం కూడా ఇట్టే పెరిగి పెచ్చరిల్లిపోవడం అన్న విషయం బాగా అనుభవం ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలకి కూడా మింగుడు పడేది కాదు. లారెంజ్‌కి రాబర్ట్‌వైట్ అని ఓ మిత్రుడు ఉండేవాడు. ఇతను ఎం.ఐ.టి. వాతావరణ విభాగంలో లారంజ్‌కి సహోద్యోగి. లారెంజ్ అతనితో తూనీగ న్యాయం గురించి, వాతావరణ నిర్ణయం గురించి చర్చించాడు. "వాతావరణాన్ని నిర్ణయించడవేం ఖర్మ, సుభ్రంగా నియంత్రించొచ్చు!" అన్నాడాయన ధీమాగా. నిజమే. స్వల్ప కారణాలు పెనుఫలితాలు
కలుగుజేసేట్టయితే నియంత్రణకేం తక్కువ?
కాని లారెంజ్ సమస్యని మరో కోణం నుండి చూశాడు. చిన్న చిన్న ప్రభావాలతో వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులు తేవడం అసాధ్యం కాదు. కాని ఆ మార్పు మనకు అనువుగా ఉంటుందని ఏంటి నమ్మకం? వర్షాన్ని ఆకర్షించబోతే వరదలొచ్చి పడవని ఏంటి భరోసా?
లారెంజ్ ఆవిష్కరణ కేవలం యాదృచ్ఛికంగా జరిగింది. యాదృచ్ఛికమైన ఆవిష్కరణ అంటే అలనాడు స్నానాలతొట్టెలో నుండి లేచి దిసమొలతో వీధుల వెంట పరుగెత్తిన ఆర్కిమెడిస్సే గుర్తొస్తాడు. అయితే మన లారెంజ్ మరీ అంత సిగ్గు మాలిన వాడు కాడు. అనుకోకుండా తెలిసొచ్చిన విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. గణితశాస్త్రం సంబంధమైన పద్ధతులతో ఆ విషయాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయడం మొదలెట్టాడు. ఆ భావాంకురాన్ని శ్రద్ధగా పోషించి ఓ మహాశాస్త్రవృక్షానికి రూపం పోశాడు.
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.
Extraordinary narration..