ఏది అసంభవం అన్నది సాపేక్షమైన విషయం
ఒక భౌతిక శాస్త్రవేత్తగా "అసంభవం" అన్న పదం సాపేక్షం అన్న విషయం త్వరలోనే గుర్తించాను. చిన్నప్పుడు స్కూల్లో ఒక రోజు మా క్లాస్ టీచర్ గోడ మీద తగిలించిన భూమి పటాన్ని చూబిస్తూ దక్షిణ అమెరికా తీరరేఖని, ఆఫ్రికా తీర రేఖని జాగ్రత్తగా చూడమంది. ఈ రెండు తీరరేఖలూ ఒకదాంతో ఒకటి ఓ జిగ్సా పజిల్ లోలా సరిగ్గా సరిపోవడం చిత్రంగా లేదూ? అని అడిగింది. బహుశా ఆ రెండు ఖండాలు ఒకప్పుడు ఒకే విశాల అఖండ భూభాగంలో భాగాలేమో? అని కొందరు శాస్త్రవేత్తలు భావించారట. కాని అదెలా సాధ్యం? అంత పెద్ద ఖండాలని కదిలించగల శక్తి అసలెలా ఉంటుందు? అంటూ అదసలు అసంభవం అని ఆవిడే నిర్ణయించేసింది.
అదే ఏట కొంత కాలం తరువాత డైనోసార్ల గురించి నేర్చుకున్నాం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు భూతలాన్ని ఏలేవట. ఉన్నట్లుండి అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయట. విచిత్రంగా లేదూ? బహుశ అంతరిక్షం నుండి రాలి పడ్డ ఏ ఉల్క వల్లనో అవన్నీ నాశనమై ఉండొచ్చు అని కొందరు పురాజీవశాస్త్రవేత్తలు (paleontologists) భావించారు. కాని అదెలా సాధ్యం? అదంతా కాల్పనిక విజ్ఞానంలోనే జరుగుతుంది.
కాని ఈ రోజు పృథ్వీ ఫలక చలనాల (plate tectonics) వల్ల ఖండాలు కదులుతాయని మనకి తెలుసు. 65 మిలియన్ ఏళ్ల క్రితం 6 మైళ్ల పరిమాణం ఉన్న ఓ ఉల్క భూమి మీద పడి డైనొసార్లనే కాదు ఇంచుమించు భూమి మీద సమస్త జీవరాశిని ధ్వంసం చేసిందని మనకిప్పుడు తెలుసు. ఒకప్పుడు అసంభవం అని భావింపబడ్డవి తదనంతరం వైజ్ఞానిక వాస్తవంగా పరిణమించడం నా అనుభవంలో ఎన్నో సార్లు చూస్తూ వస్తున్నాను. అయితే భవిష్యత్తులో తృటిలో ఒకచోట అదృశ్యమై ఏదో దూర ప్రదేశంలో ప్రత్యక్షం కాగలమా? కొన్ని కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న తారలకి ప్రయాణించగలమేమో?
సామాన్యంగా అలాంటి విషయాలని భౌతిక శాస్త్రవేత్తలు అసాధ్యమైన మహత్యాలుగా పరిగణిస్తారు. పోనీ కొన్ని శతాబ్దాల తరువాత అవన్నీ నిజమవుతాయేమో? పోనీ పదివేల ఏళ్ల తరువాత మన సాంకేతిక సామర్ధ్యం మరింత అభివృద్ధి చెందాక వీలవుతుందేమో? మన కన్నా ఓ మిలియన్ సంవత్సరాలు ముందున్న ఓ నాగరికత మనకి తారసపడితే వారి రోజూవారీ సాంకేతిక నైపుణ్యం మనకి నమ్మలేని "మహత్యం"లా తోచుతుందేమో?
ఈ పుస్తకంలో అంతర్వాహినిగా ప్రతీ చోట మనకి ఎదురయ్యే భావన ఇదే. ప్రస్తుతం "అసంభవం" అనుకున్నది ఎప్పటికీ అసంభవంగా మిగిలిపోతుందా?
గత శతాబ్దంలో విజ్ఞానం వేసిన వడి వడి అడుగులని గమనిస్తే, ముఖ్యంగా క్వాంటం సిద్ధాంతం, సామాన్య సాపేక్షతా సిద్ధాంతం మొదలైన వాటి రూపకల్పన జరిగిపోయిందని జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ అద్భుత వైజ్ఞానిక విశేషాలు ఎప్పటికి నిజం అవుతాయో చూచాయగా అంచనా వేసుకోవచ్చు.
స్ట్రింగ్ థియరీ వంటి మరింత అధునాతన సిద్ధాంతాల రంగప్రవేశంతో, ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కే పరిమితమైన కాలయానం, అన్య విశ్వాలు మొదలైన భావనలని భౌతిశాస్త్రవేత్తలు పున:పరిశీలిస్తున్నారు. ఓ 150 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు అసంభవం అని కొట్టిపారేసిన విషయాలు, ప్రస్తుతం మన దైనిక జీవనంలో భాగాలైన విషయాలని ఒక్కసారి గమనిద్దాం. 1863 లో జూల్స్ వెర్న్ ’ఇరవయ్యవ శతబ్దంలో పారిస్’ అనే నవల రాశాడు. ఆ పుస్తకం ఇంచుమించు ఓ శతాబ్దకాలం పాటు ఎవరికీ తెలీకుండా అజ్ఞాతంగా ఉండిపోయింది. అంతలో హఠాత్తుగా ఆ రచయిత మునిమనవడు దాని ఉన్కి గురించి తెలుసుకుని దాన్ని మొట్టమొదటి సారిగా 1994 లో ప్రచురించాడు. 1960 లో పారిస్ ఎలా ఉంటుందో ఊహించి అందులో వర్ణించాడు జూల్స్ వెర్న్. పందొమ్మిదవ శతాబ్దంలో అసంభవాలు అనుకునే విషయాలతో నిండి వుందా నవల. ఫాక్స్ మెషిన్లు, ప్రపంచ వ్యాఫ్తమైన సమాచార జాలాలు, అద్దపు ఆకాశ సౌధాలు, వాయుచోదిత వాహనాలు, అంతెత్తు మీద వాయువేగంతో కదిలే రైళ్లు - ఇవన్నీ ఆ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
వెర్న్ భవిష్యత్తుని అంత కచ్చితంగా దర్శించగలగడానికి కారణం అతడు ఆ రోజుల్లో లభ్యమైన విజ్ఞానంలో పూర్తిగా మునిగు వుండడమే. తన చుట్టూ ఉన్న శాస్త్రవేత్తలతో అతడికి సాన్నిహిత్యం ఉండేది. సైన్సులో మౌలిక భావాలని లోతుగా అర్థం చేసుకున్నాడు గనుకనే అలాంటి అద్భుతమైన భవిష్యద్ దర్శనం అతడికి వీలయ్యింది.
కాని చిత్రం ఏంటంటే పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఎందరో మహామహుల్లాంటి శాస్త్రవేత్తలు కూడా ఇందుకు వ్యతిరేకమైన పద్ధతినే అవలంబించారు. ఎన్నో రకాల సాంకేతిక సామర్ధ్యాలన్నీ బొత్తిగా అసాధ్యమని కొట్టిపారేశారు. ఉదాహరణకి విక్టోరియా యుగంలో అత్యంత ప్రముఖుడైన లార్డ్ కెల్విన్ (వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి పక్కనే ఇతణ్ణి సమాధి చేశారు) "గాలి కన్నా బరువైన" ఎగిరే వాహనాలు (విమానాల్లాంటివి) అసంభవం అని తేల్చేశాడు. ఎక్స్-రేలు వట్టి బూటకం అన్నాడు. రేడియో కి అసలు భవిష్యత్తే లేదన్నాడు.
పరమాణువులో కేంద్రకాన్ని కనుక్కున్న లార్డ్ రూథర్ ఫర్డ్ ఆటం బాంబ్ తయారీ అసాధ్యం అన్నాడు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన రసాయన శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చగల పరుసవేది అనే మహత్తర పదార్థం అసలు లేదని నిర్ణయించారు. సీసం లాంటి మూలకాలు ఎన్నటికీ మారవన్న నమ్మకం మీద ఆధారపడింది పందొమ్మిదవ శతాబ్దపు రసాయన శాస్త్రం. కాని నేటి పరమాణు ధ్వంసక సాధనాలలో ఒక విధంగా చూస్తే సీసాన్ని బంగారంగా మార్చడం సాధ్యమే. ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభంలో ప్రస్తుతం మనం రోజూ వాడే టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ మొదలైన వన్నీ ఎంత మహిమాన్వితంగా కనిపిస్తాయో ఒక్కసారి ఊహించండి.
ఇటీవలి కాలం వరకు నల్ల బిలాలు (black holes) అనేవి కాల్పనిక విజ్ఞానానికే పరిమితం అనుకున్నారు. అసలు ఐనిస్టయినే 1939 లో నల్లబిలాలు రూపొందే అవకాశమే లేదని "నిరూపిస్తూ" ఓ పరిశోధనా పత్రం రాశాడు. అయినా మరి నేడు హబుల్ స్పేస్ టెలిస్కోప్, చంద్ర ఎక్స్-రే టెలిస్కోప్ లు అంతరిక్షంలో వేలాది నల్లబిలాలని కనుక్కున్నాయి.
ఈ సాంకేతిక సామర్ధ్యాలన్నీ ఆ రోజుల్లో "అసంభవాలు" అని భావింపబడటానికి కారణం, ఆ రోజుల్లో సైన్సు యొక్క మూల ధర్మాలన్నీ తెలియకపోవడమే. ఆ రోజుల్లో వారికి తెలిసిన విజ్ఞానంలోని వెలితిని గమనిస్తే, అలాంటి సాంకేతిక ఫలితాలు అసంభవం అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.
వ్యాసవిషయాన్ని పక్కన పెట్టి వ్యాఖ్య రాస్తున్నందుకు మన్నించాలి.
"చూబిస్తూ"
తొలిచూపులో నాకిది "చుంబిస్తూ" అనే పదాన్ని తలపించింది. మొదట టైపాటేమో అనుకున్నాను. కానీ మీ బ్లాగులో ఈ ప్రయోగాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు చూసినట్లు గుర్తు. మీరిలాగే పలుకుతున్నారా ?
ఇక్కడ చూబిస్తూ = చూపిస్తూ అన్న అర్థం లోనే వాడాను. మామూలు వాడుక భాషలో "చూబిస్తూ", "చూబించు" అని కూడా వాడడం వింటుంటాం. కాని అన్ని పదాలలోనూ అలా వాడలేదు. ఉదాహరణకి "నిరూపిస్తూ", "కనిపిస్తాయో" అన్న చోట ’ప’ అక్షరాన్నే వాడడం జరిగింది. ఆధునిక వ్యావాహారిక తెలుగుని శాసించే ప్రామాణిక గ్రంథాలు ఉన్నట్టు తెలీదు. ఉంటే నచ్చితే అనుసరిస్తాను.
ఈ బ్లాగ్ లో ఇంతవరకు వచ్చిన వ్యాఖ్యల్లో వ్యాసాంశం మీద చేయబడ్డ వ్యాఖ్యలు బహుతక్కువ. సైన్స్ కి సంబంధించిన వ్యాసాల గురించి ఎంతో సరదాగా, ఆసక్తికరంగా చర్చించుకోవచ్చు. ఇంగ్లీష్ లో సైన్స్ కి సంబంధించిన ఎన్నో బ్లాగ్ లలో, వెబ్ సైట్లలో ఇలాంటి తీరు కని’పి’స్తుంది. అలాంటి చోట్ల శాస్త్ర చర్చలు చూస్తుంటే అదో విజ్ఞానోత్సవంలా తోచుతుంది. ముచ్చటేస్తుంది.
కాని ఇలా... పాయసాన్ని పక్కన పెట్టి పాత్రకి ప్రాధాన్యత ఇవ్వటం... కొంచెం విడ్డూరంగా అని’పి’స్తుంది.