కమ్మని సంగీతం వింటున్నప్పుడు లయబద్ధంగా తలలు ఆడించడం, పాదాలు తాటించడం చేసేది మనుషులు మాత్రమే కాదు. పక్షులకీ ఆ మాత్రం రసజ్ఞత ఉందని అధ్యయనాలలో తేలింది.
సాన్ డియాగోలో ప్రఖ్యాత ’న్యూరోసైన్సెస్ ఇన్స్టిట్యూట్’ కి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనిరుధ్ పటేల్, అతడి బృందం ఇలాంటి అధ్యయనం ఒకటి చేశారు.
’స్నోబాల్’ అనబడే పచ్చని తురాయి గల ఓ కొకటూ (చిలక లాంటి పక్షి) పాటకి నాట్యం చెయ్యడం ఓ యూ ట్యూబ్ వీడియోలో అనిరుధ్ పటేల్ చూశారట. అయితే ఆ నాట్యం ఎంత లయబద్ధంగా ఉందో పరిశీలిద్దామని ఆయన బృందం ఓ అధ్యయనం చేశారు.
బాక్ స్ట్రీట్ బాయిస్ పాడిన ’ఎవిరీడే’ పాట అంటే ఈ స్నోబాల్ కి మహా ఇష్టమట! ఆ పాటకి పక్షి నాట్యం చేస్తున్నప్పుడు వీడియో తీశారు. దాని తల కదలికలు, పదఘట్టనలు సంగీత ధ్వనులకి ఎంత సన్నిహితంగా ఉన్నాయో జాగ్రత్తగా కొలిచారు. ఊరికే తలాడిస్తుంటే ఏదో యాదృచ్ఛికంగా లయ కలుస్తోందా, లేక నిజంగానే తాళం వేస్తోందా చూశారు. మనుషులు ఎంత కచ్చితంగా తాళం వెయ్యగలిగారో, ఆ పక్షి కూడా అంతే కచ్చితంగా తాళం వెయ్యగలిగిందని తేలింది. పాట యొక్క గతిని కృత్రిమంగా, శృతి మారకుండా, వేగంవంతం చేసి, లేదా మరింత నెమ్మది చేసి ప్లే చేశారు. దానికి అనుగుణంగా పక్షి కూడా తాళ వేగాన్ని మార్చుకుంది!
అలాగే ఆఫ్రికా కి చెందిన ఓ ధూమ్రవర్ణ చిలక (African grey parrot) తో కూడా ఇలాంటి పరిశోధనలే చేసిన అడెనా షాక్టర్ కి కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి.
ఈ రెండు అధ్యయనాలు ’కరెంట్ బయాలజీ’ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి.
విన్న శబ్దాలని తిరిగి చర్యలతో ప్రకటించే సామర్ధ్యం మెదడులో స్వతస్సిద్ధంగా ఉందని దీని వల్ల అర్థమవుతోంది. ఆ విధంగా పాటకి అనువర్తించడాన్నే నర్తనం అంటాం. మౌఖిక అనుకరణ - అంటే విన్న దాన్ని తిరిగి అనడం - చెయ్యడానికి మెదడులో శ్రవణ ప్రాంతానికి (auditory area) క్రియా ప్రాంతానికి (motor area) మధ్య అనుసంధానం ఉండాలి. ఇలాంటి అనుసంధానమే సంగీతానికి స్పందించి నర్తించే సామర్థ్యంగా వ్యక్తమవుతోంది.
http://www.youtube.com/watch?v=N7IZmRnAo6s
http://www.thenakedscientists.com/HTML/podcasts/podcast-transcript/transcript/2009.05.04-1/
ఆర్యోక్తి నిజమని నిరూపించిన పక్షి వివరాలను అందించిన మీకు ధన్యవాదాలు.
చక్కటి విశ్లేషణ. అసందర్భం అయినా మీకు ఈసందర్భంగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న ఆర్యోక్తి అర్థం పశువులు, పిల్లలూ కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి అని కాదండి.
శిశువు అంటే బాలసుబ్రహ్మణ్యుడు, పశువు అంటే నందీశ్వరుడు. అలాగే ఫణి అంటే శంకరాభరణం.
ఈముగ్గురు నాదరూపుడైన ఆమహదేవుని సన్నిధిలో నిత్యం ఉంటారు కాబట్టి వారికి తెలిసినంత సంగీతజ్ఞానం ప్రపంచంలో మరెవరికీ ఉండవు అని.
ఇదికూడా నేను మీలాగా విని చెప్తున్నదే.