కొరివి దెయ్యమా? భాస్వరమా?
గత ఏడాది చిత్తూరు జిల్లాలో, మోరంపల్లి గ్రామంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
ఒక్క నెలలో గుక్కతిప్పుకోనీకుండా వరుసగా అనర్థాలు జరిగి గ్రామస్థులని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంచి పాలిచ్చే పాడి ఆవులు అకాల మృత్యు వాత పడ్డాయి. పాము కాటు వంటిది ఏమీ లేదు. అకారణంగా ఇళ్లు భగ్గున నిప్పంటుకుని తగులబడిపోయాయి. మొదట ఓ గడ్డి వాము. తరువాత ఓ రెండిళ్లు. తరువాత ఊళ్లో ఎవరూ లేని సమయంలో వరుసగా 23 ఇళ్లు తగులబడిపోయాయి. ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. 23 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా.
ఇదేదో శాపం అని ఊళ్లో వాళ్ళు బెంబేలు పడిపోయారు.
"గ్రామంలో సైన్సుకి అంతుచిక్కని అనర్థాలు" అంది ఓ ప్రాంతీయ దినపత్రిక. "ఇదేమైనా దెయ్యం చేస్తున్న పనా?" అంది మరో పత్రిక. ఆ అగ్ని లాగే అది పుట్టించిన ఆందోళన కూడా ఇరుగు పొరుగు ప్రాంతాలకి వేగంగా వ్యాపించింది.
సమస్య ఏంటో తేలుద్దామని "పరివర్తన" అనబడే ఓ మానవతా సంస్థకి చెందిన ప్రొ. వెంకట్ రెడ్డి, శ్రీ ఎం.సి.వి. ప్రసాద్ లు రంగంలోకి దిగారు. వీరితో పాటు మూడనమ్మకాలని పారద్రోలడానికి కంకణం కట్టుకున్న చంద్రయ్య అనే స్థానికుడు, ఓ అంతర్జాతీయ మానవతా హక్కుల సంస్థకి చెందిన గోగినేని బాబు, డా. ప్రభాకర్ రెడ్డి అనే విద్యావేత్త తదితరులు కూడా రంగప్రవేశం చేశారు.
"రెండు కొరివి దయ్యాల మధ్య గొడవ బాబూ, అందుకే ఇలా అగ్గి పుట్టిస్తున్నాయి," అని చెప్పుకొచ్చాడో గ్రామస్థుడు. "అదుగో చూడండి. అంతంత లేసి దూలాలు. ఆటికి నిప్పెట్టటం చాలా కష్టం. ఎవరూ లేని సమయంలో అంటుకున్నాయి. ఊళ్లో అంతా పవిత్ర జలం చల్లించాం లేండి. ఓ గుడి కట్టీస్తే ఈ పీడ విరగడ అవుతుంది."
Rs 30,000 సమర్పించుకుంటే పీడ వొదలగొడతానని వచ్చాట్ట ఓ మంత్రగాడు. "ఫీజు" మరీ ఎక్కువని గ్రామస్థులు ఊరుకున్నార్ట. మనపల్లిలో ఓ ఆలయం నుండి ఓ ఆచారి వచ్చి ఏవో పూజలు చేసి కేవలం Rs. 3000 తో సరిపెట్టుకున్నాట్ట. అంతలో ఉచితంగా సమస్య పరిష్కరిస్తానని ముందుకొచ్చిన నాగరాజు అనే వ్యక్తి కూడా ఏవో పూజలు చేస్తే, గ్రామస్థులు పోనీలే అని Rs. 2000 సమర్పించుకున్నార్ట. అంతే కాక ఈ నాగరాజు ఏ ఇల్లు అగ్ని వాత పడుతుందో "అద్భుతంగా" ముందే చెప్పగలిగే వాడు. దాంతో అతడంటే గ్రామస్థులకి బాగా గురి కుదిరింది.
అసలు విషయం
అసలు విషయం మెల్లగా బయట పడింది.
1) పశువుల ప్రాణాలు పోవడానికి కారణం విషాహారం: ఎవరో కావాలని మందు పెడుతూ వచ్చారు. ఈ విషయం ఆ ఊళ్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ ని హేతువాద బృందం వాకబు చెయ్యగా బయటపడింది. విషాహారం పెట్టిన చిహ్నాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నాడు డాక్టరు. గట్టిగా చెప్తే విషం పెట్టింది ఎవరో తెలీక గ్రామస్థుల మధ్య గొడవలు బయల్దేరతాయని భయపడి ఊరుకున్నాడట డాక్టరు.
2) అగ్నుల వెనకున్న రసాయన శాస్త్రం:
స్వతస్సిద్ధంగా పుట్టే అగ్నుల వెనుక ఉన్న రహస్యం భాస్వరం (phosphorous). భాస్వరానికి బహురూపత (allotropy) అనే లక్షణం ఉంది. అంటే వాటన్నిటిలోను ఉండేది, భాస్వరపు పరమాణువులే అయినా, అణువుల స్థాయిలో వాటి విన్యాసం వేరు వేరుగా ఉంటుంది. భాస్వరంలో మూడు రకాలు:
1) తెల్ల భాస్వరం, 2) ఎర్ర భాస్వరం, 3) నల్ల భాస్వరం.
http://en.wikipedia.org/wiki/Allotropes_of_phosphorus
తెల్ల భాస్వరానికి గాలి సోకితే నిప్పు అంటుకుంటుంది. అందుకే దాన్ని నీట్లో (నీట్లో పెద్దగా కరగదు కనుక) నానబెట్టి భద్రపరచుతారు.
తెల్ల భాస్వరాన్ని గాల్లో ఓ పావుగంట సేపు వొదిలేస్తే దానికదే నిప్పు అంటుకుంటుంది. ఆ వీడియోని ఇక్కడ చూడొచ్చు.
http://www.angelo.edu/faculty/kboudrea/demos/burning_phosphorus/burning_phosphorus.htm
ఎర్ర భాస్వరం అంత సులభంగా అంటుకోదు గాని రాపిడి చేత అది కూడా నిప్పంటుకునేలా చెయ్యొచ్చు. అగ్గిపెట్టెల పైన పుల్లని వెలిగించే చోట ఈ ఎర్ర భాస్వరపు పూత వేస్తారు.
నల్ల భాస్వరం అంత సులభంగా చర్య జరపదు.
(భాస్వరంతో ప్రయోగాలని నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఇంట్లో చెయ్యొద్దని మనవి.)
తెల్ల భాస్వరాన్ని ఓ తడిబట్ట మీద పూసి ఎండలో పెడితే, బట్ట ఆరాక భాస్వరం దానికదే నిప్పు అంటుకుంటుంది. ఈ "టెక్నాలజీ" నే ఆ పల్లెలో ఎవరో ఆగంతకులు వాడారు.
ఈ రహస్యాన్ని చంద్రయ్య బయటపెట్టాడు. భాస్వరంతో ఈ అగ్నులని ఎలా పుట్టించొచ్చో గ్రామస్థులకి ప్రదర్శనలిచ్చాడు. భాస్వరం కలిపిన (తడి) పేడతో పిడకలు చేసి ఓ పాక మీద పెట్టాడు. పిడక ఆరాక ఎండలో దానికదే భగ్గున అంటుకుంది. ఇలాగే ఎన్నో "వైజ్ఞానిక గారడీలు" చూబించి గ్రామస్థులకి ఆ వివరణల మీద నమ్మకం కుదిర్చాడు.
ఇక తక్షణ కర్తవ్యం దొంగని పట్టుకోవడం. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. నాగరాజు పరారయ్యాడు. తనతో పాటు మరిద్దరు "సాధువులు" కూడా పరారయ్యారు. ఈ నాగరాజు కూడా ఓ "సాధుపుంగవుడి" కొడుకే నని తరువాత తెలిసింది.
గ్రామంలో మంటలు పుట్టడం ఆగిపోయింది. పశువుల అకాలమరణాలు కూడా నిలిచిపోయాయి.
ఊరికి కావలసింది గుడి కాదని, ఓ మంచి బడి అని గ్రామస్థులకి అనిపించింది. శిధిలావస్థలో ఉన్న బడిని చక్కగా తీర్చిదిద్దాలని అంతా నిశ్చయించుకున్నారు.
Reference:
http://www.iheu.org/humanists-unravel-a-crime-in-rural-india
nice