పాలపుంత గెలాక్సీ
పై చిత్రంలో మొత్తం పాలపుంత గెలాక్సీని చూడొచ్చు. ఇందులో ఉండే 200 బిలియన్ల (200,000,000,000) తారల్లో మన సూర్యుడు ఒకటి.
మన సూర్యుడు గెలాక్సీ కేంద్రం నుండి 26,000 కాంతిసంవత్సరాల దూరంలో ఉన్నాడు. గెలాక్సీ వ్యాసం లక్ష కాంతిసంవత్సరాలు కనుక, సూర్యుడు కేంద్రానికి కన్నా అంచుకి కొంచెం దగ్గరలో ఉన్నాడన్న మాట. అంటే మనం పాలపుంత అనే నగరానికి ’సబర్బ్’ లో ఉన్నాం అన్నమాట.
సౌరమండలంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించినట్టుగానే, పాలపుంతలో తారలన్నీ కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. సౌరమండలంలో సూర్యుడికి దగ్గరలో ఉన్న గ్రహాలు ఎక్కువ వేగంతో కదిలినట్టుగానే, పాలపుంతలో కేంద్రానికి దగ్గర్లో ఉన్న తారలు ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తాయి.
సూర్యుడితో పాటు, మనకి దరిదాపుల్లో ఉన్న తారలు గెలాక్సీ కేంద్రాన్ని బట్టి రమారమి సెకనుకి 150 మైళ్ల వేగంతో కదులుతాయి. ఆ లెక్కన సూర్యుడికి గెలాక్సీ కేంద్రం చుట్టు ఒక ప్రదక్షిణ చెయ్యడానికి 200 మిలియన్ (200,000,000) సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు ’హెర్క్యులిస్’ అనే తారారాశి (constellation) దిక్కుగా కదులుతున్నాడు.
అలాగే పాలపుంత కేంద్రం చుట్టూ తారల కక్ష్యలలో కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది. సూర్యుడి కక్ష్య ఇంచుమించు వృత్తాకారంలో ఉంటుంది. ఇక ’ఆర్క్ ట్యూరస్ (స్వాతి)’ లాంటి తారల కక్ష చాలా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అంటే కేంద్రం నుండి దగ్గరికీ దూరానికి జరుగుతూ ఉంటాయన్నమాట.
బాగా ప్రకాశవంతంగా కనిపిస్తున్న కేంద్రంలో అధికసంఖ్యలో తారలు ఉన్నాయి. కేంద్రంలో నూరు బిలియన్ (100,000,000,000) తారలు ఉన్నాయని అంచనా. గెలాక్సీ అంచుల వద్ద పలచగా ఉన్నా, దళసరిగా కనిపిస్తున్న కేంద్రం యొక్క మందం 3,000 కాంతిసంవత్సరాలు.
గెలాక్సీ ఉన్న తలానికి కొంచెం బయటగా చిన్న తెల్లని చుక్కలు కనిపిస్తున్నాయి. అవి గోళాకార రాశులు (globular clusters). ఇవి చిన్న చిన్న తారా సందోహాలు. వీటిలోని తారలు గోళాకారంలో, అంటే అన్ని దిశలలో ఒకే విధంగా, విస్తరించి ఉంటాయి కనుక వీటిని అలా పిలుస్తారు. వీటిలో సగటున ఒక్కొక్క దాంట్లో కొన్ని పదుల వేల దగ్గర్నుండి, పదుల మిలియన్ల తారలు ఉంటాయి. ఈ గోళాకార రాశులు మన పాలపుంత చుట్టూ బాగా దూరం (సగటున 131,000 కాంతిసంవత్సరాలు) నుండి పరిభ్రమిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి 158 గోళాకార రాశులని కనుక్కున్నారు. తొలిదశల్లో వీటి గురించి చాలా పరిశోధన చేసిన చార్లెస్ మెసియర్ గౌరవార్థం వీటికి M1, M2, ... ఇలా పేర్లు పెడుతూ వచ్చారు. పై చిత్రంలో M2, M5, M15, M30, M68, M75 మొదలైన గోళాకార రాశులని చూడొచ్చు.
ఇక పాలపుంతకి కాస్త కిందుగా మరో బుల్లి గెలాక్సీ కనిపిస్తోంది. భూమికి చంద్రుడి లాగానే అది మన గెలాక్సీకి ఉపగెలాక్సీ. దీని పేరు ’సాజిటేరియస్ మరుగుజ్జు గెలాక్సీ’ (Sagittarius dwarf galaxy). కాని పాపం మన గెలాక్సీ దీన్ని క్రమంగా కబళించేస్తోంది. కొంత కాలం (కోట్ల సంవత్సరాలు!) తరువాత ఇది పూర్తిగా మన గెలాక్సీలో కలిసిపోయి నామరూపాలు లేకుండా పోతుంది. గేలక్సీ ల స్థాయిలో కూడా "పరపీడన పరాయణత్వం" తప్పదన్న మాట.
References:
Isaac Asimov, Asimov Guide to Science 1: Physical Sciences, Penguin.
http://www.atlasoftheuniverse.com/galaxy.html
http://en.wikipedia.org/wiki/Globular_cluster
Nice information about our galaxy
Very beautifully given the details.
Good information sir