మా బ్లాగు లక్ష్యం తెలుగులో విజ్ఞాన ప్రచారం.
విజ్ఞాన ప్రచారం ఎందుకంటారా? కొన్ని కారణాలు.
1. విజ్ఞానం ప్రగతికి కీలకం.
ఆధునిక జీవనం విజ్ఞానం అనే పునాది మీద ఎదుగుతోంది. వైజ్ఞానిక విషయాలలో దక్షత ఉన్న సమాజాలు సమకాలీన ప్రపంచంలో బాగా ముందుకు వెళ్లగలుగుతున్నాయి. వైజ్ఞానిక సమాచారం ఇంగ్లీష్ లో ఉంటే అది మన దేశంలో ఇంగ్లీష్ వచ్చిన 10% మందికి మాత్రమే అందుతుంది. కనుక విజ్ఞానం ప్రాంతీయ భాషల్లో లభ్యమై ఉండాలి.
2. విజ్ఞానం పట్ల సమాజంలో అపోహలు తొలగాలి.
మన సమాజంలో విజ్ఞానం పట్ల కొన్ని చిత్రమైన అపోహలు ఉన్నాయి. విజ్ఞానాన్ని "మరీ ఎక్కువగా పూసుకుంటే మానవత్వం తగ్గిపోవడం" వంటి విచిత్రమైన భావనలు చలామణిలో ఉన్నాయి. చాలా మంది విజ్ఞానాన్ని ఓ అనుమానాస్పద విషయంలా చూస్తారు. విజ్ఞానం అంటే భయపడతారు కూడా. దానికి కారణం విజ్ఞానం పట్ల సరైన అవగాహన, స్పృహ లేకపోవడమే. మనకి తెలీని దాని గురించి భయపడతాం, అనుమానిస్తాం; తెలిశాక దాంతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం మొత్తం విజ్ఞానాన్ని వొదిలేసి అడవులకి వలస వెళ్లే అవకాశం లేదు. కనుక విజ్ఞానానికి బెదిరి దూరంగా ఉండే కన్నా, దాన్ని సక్రమంగా నేర్చుకుని, జయించడమే ఉత్తమమైన మార్గం.
3. విజ్ఞానం యొక్క సారం దివ్యంగా ఉంటుంది.
విజ్ఞానం యొక్క ఫలితాలు తగని వారి చేతుల్లో పడినప్పుడు, అవాంఛనీయ ఫలితాలు రావచ్చు. విజ్ఞానం పట్ల భయానికి కారణాల్లో ఇదొకటి. కాని విజ్ఞానం యొక్క అంతర్యంలోకి తొంగి చూస్తే, దాని సారం ఏంటో తెలుసుకుంటే, ఆ భయం కాస్తా వల్లమాలిని ప్రేమగా మారిపోతుంది. సంగితం, సాహిత్యం, క్రీడ...మొదలైన రంగాలలో లాగానే, విజ్ఞానం యొక్క సమ్మోహనం ఎంత గాఢంగా ఉంటుందో శాస్త్రవేత్తల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. (శాస్త్రవేత్తలకి, విజ్ఞానానికి మధ్య సాగే "ప్రేమకథల" గురించి కూడా ముందు ముందు కొన్ని పోస్టులు వేస్తాం.)
4. విజ్ఞానంలో మన దేశం నేతృత్వ స్థానంలో ఉండాలి.
ఆధునిక విజ్ఞానం పాశ్చాత్య లోకంలో కొన్ని శతాబ్దాల క్రితం పుట్టింది. రాజకీయ పరిస్థితుల వల్ల మనం ఆ ఉద్యమంలో గత శతాబ్ద కాలం వరకు పెద్ద ఎత్తున పాల్గొన లేకపోయాం. కనుక పాశ్చాత్యులు కనుక్కున్న విజ్ఞానాన్ని మనం నేర్చుకుని, సమర్ధవంతంగా వినియోగించడంలోనే ఎక్కువగా మన ప్రతిభ కనిపిస్తోంది. ఐటి, అంతరిక్షం, అణు శక్తి మొదలైన రంగాలు మాత్రమే కాక అన్ని వైజ్ఞానిక రంగాల్లోనూ భవిష్యత్తులో మన దేశం నేతృత్వ స్థానంలో ఉండాలి. అందుకు విజ్ఞాన ప్రచారం విస్తృతంగా జరగాలి.
5. ముఖ్యంగా మనస్సు, చైతన్యం మొదలైన అధునాతన రంగాల్లో మన దేశం ముందుంటే బావుంటుంది.
ఓ ప్రాచీన అధ్యాత్మిక సాంప్రదాయం భారతీయుల అమూల్య వారసత్వం. మనస్సు, చైతన్యం మొదలైన విషయాల గురించి మనకి ఎంతో ప్రాచీన సాహిత్యం ఉంది. ఆధునిక విజ్ఞానంలో చైతన్యం అనేది ఓ తెగని, ప్రధాన ప్రశ్నగా ప్రస్ఫుటమవుతోంది. మన ప్రాచీన సాహిత్యాన్ని తవ్వి తీసి, సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, ఆధునిక విజ్ఞానంతో సమన్వయ పరిచి, మనస్సుకి సంబంధించిన రంగాల్లో మనం విశేష ప్రగతి సాధించగలమా?
6. విజ్ఞానం అందరి సొత్తు కావాలి.
ఆధునిక ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు విజ్ఞానానికి సంబంధించినవై ఉంటాయి. ఓ డామ్, ఓ అణుశక్తి పాలసీ, ఓ మెట్రో నిర్మాణం, ఓ అంతరిక్ష పర్యటనా ప్రాజెక్ట్ - ఇలాంటి విషయాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సరైనవో, కావో తెలియాలంటే సైన్సు తెలియాలి. అది కేవలం కొందరు నిపుణులకే పరిమితం కావడం శ్రేయస్కరం కాదు. విజ్ఞానం అందరి సొత్తు కావాలి. సమాజం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపగల వైజ్ఞానిక నిర్ణయాలలో, వాటికి సంబంధించిన చర్చలో సమాజం పాల్గొనాలంటే విజ్ఞానం సమాజంలో లోతుగా పాతుకుపోవాలి.
ఈ లక్ష్యసాధన ఒకరిద్దరి వల్ల సాధ్యం అయ్యేది కాదు. వందల వేల సంఖ్యలో జనం పూనుకుని చెయ్యాల్సినది. ఆ దిశలో ఓ ఆవగింజంత ఫలితం చూబించినా మా బ్లాగు లక్ష్యం నెరవేరినట్టే.
good luck
మీ కృషి మెచ్చదగింది. నిరాశను దరి చేరనీయకుండా కొనసాగించండి.
మీ కృషి ఎంతో మెచ్చ దగినది!గుడ్ లక్!