జీవితం గురించి నా ఆలోచనల గురించి రాయమన్నారు, నాకేదో పెద్ద తెలిసినట్టు. ఏదో తప్పుజారి ఓ నాలుగు విషయాలు తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు కూడా. నాకూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని మాత్రం తెలుసు.
మీ ఉత్తరం చూశాక అనుకున్నాను - "ఈయన ఎవరో చాలా తెలివైన ఆయన" అని. ఎందుకంటే మీ అభిప్రాయాలు కొంచెం నా అభిప్రాయాల లాగానే ఉన్నాయి! ఉదాహరణకి "ఈ జీవితం ఓ చిక్కు సమస్య అని, మహా మహా వాళ్లకే అది అర్థం కాదని," మీరు రాసినప్పుడు, "వాడు ఏ రంగంలోకి దిగినా నాకు ఫరవాలేదు. కాని ఆ రంగంలో వాడు రాణించాలన్నదే నా ఉద్దేశం" అని అన్నప్పుడు మీతో ఏకీభవిస్తాను. (ఆ తరువాత ఈ విషయంలో మీకేదో బాధ్యత ఉన్నట్టు రాశారు. అక్కడ మీతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాను. నిజమైన, ప్రగాఢమైన ఆనందాన్ని పొందడానికి ఒక్కటే మార్గం - "నచ్చిన దాన్ని మనస్పూర్తిగా చెయ్యడం.")
పని నచ్చితే మరి తప్పకుండా అలాగే చేస్తాం. అయితే దానికి కొంత స్వేచ్ఛ ఉండాలి. నేను రాసిన ఆ పిచ్చి పుస్తకంలో కూడా పెద్దగా ప్రస్తావించలేదు గాని ఒక విషయం మాత్రం నిజం. చిత్రకళలో, మాయన్ రహస్య సంకేతాలని భేదించడంలో, డప్పు వాయించడంలో, కాంబినేషన్ లాక్ లని భేదించడంలో - ఇలా ఎన్నిట్లోనో చాలా శ్రమించాను. పురోగతికి మనలో ఉన్న ప్రతీ అవకాశాన్ని పెంచి పోషించి, ఆ దిశలో ఎంత దూరం వెళ్లగలమో పరీక్షించుకుంటే... అదే జీవితమేమో!
కొందరి విషయంలో ఏం జరుగుతుందంటే (మీ అబ్బాయి విషయంలో లా) చిన్న వయసులో ఒక రంగంలో వీలైనంత వేగంగా, వీలైనంత దూరం వెళ్తారు. ఇక తక్కినవన్నీ అప్రధానమని నిర్లక్ష్యం చేస్తారు. కాని పెద్ద అవుతున్న కొలది జీవితంలో ప్రతీదీ చాలా ఆసక్తికరమైనదే నని అర్థమవుతుంది. అయితే అది అర్థం కావడానికి అందులోకి కొంచెం లోతుగా వెళ్లాలి. చిన్నతనంలో కూడా మనం తెలుసుకునేది అదే. ఒక రంగంలోకి లోతుగా వెళ్లాం కనుకనే అది ఆసక్తికరంగా అనిపించింది. ఆ కసరత్తు కొన్ని రంగాల్లో చేశాకనే, అదే సత్యం అన్ని రంగాలకీ వర్తిస్తుందని అర్థమవుతుంది. తనకి నచ్చిన విషయాలని హాయిగా, ఇష్టం వచ్చినట్టు చదువుకోనివ్వండి.
స్కూలు తనకి తక్కువ మార్కులతో సత్కరిస్తుంది నిజమే. అయినా ఫరవాలేదు. అన్నిట్లోను కొంచెం కొంచెం తెలిసేకన్నా కొన్నిట్లో లోతైన పరిజ్ఞానం ఉంటే మేలు.
మీకు మరో విషయం చెప్తే సంతోషిస్తారేమో. నోబెల్ బహుమతి పొందిన డాన్ గ్లేసర్ (బబుల్ చేంబర్ ని కనుక్కున్నాడు ఇతను) తల్లిదండ్రులకి, తమ పుత్రరత్నం మూడో క్లాసులో ఉన్నప్పుడు మతి మాంద్యం గల పిల్లల్ని చేర్పించే స్కూల్లో చేర్పించమని వాళ్ల బడి అధికారులు సలహా ఇచ్చారట. కాని ఆ తల్లిదండ్రులు ఆ సలహా పట్టించుకోలేదు. ఆ మరుసటేడే ఆ పిల్లవాడు లెక్కల్లో దిట్ట అని తేలింది. పెద్ద పెద్ద భాగారాలని సునాయాసంగా చేసేవాట్ట. చిన్న తరగతుల్లో పరీక్షల్లో అడిగే చెత్త ప్రశ్నలకి సమాధానాలు రాయడం వృధా అనుకునేవాట్ట - డాన్ నాతో ఓసారి స్వయంగా చెప్పాడు. కాని పెద్ద సంఖ్యల భాగారం కొంచెం కష్టంగా అనిపించిందట. ఫలితం ఎలా ఉంటుందో ముందు చెప్పడం కొంచెం కష్టం. కనుక ఆ ప్రయత్నం ఉత్సాహంగా అనిపించిందట. కనుకనే ఆ సమస్య మీద ప్రత్యేక శ్రద్ధ చూబించి రాణించాడు.
అంచేత బెంగపడకండి. అలాగని డాన్ లాగా మరీ చేజారిపోనివ్వకండి. ఏం సలహా ఇవ్వను? నేను ఇచ్చినా అతడు తీసుకోకపోవచ్చు. కాని మీరిద్దరు - మీ తండ్రి, కొడుకులు ఇద్దరూ - సాయం సమయంలో హాయిగా కలిసి షికార్లకి (ఓ గమ్యం, లక్ష్యం లేకుండా) వెళ్తూ నానా విషయాలూ మాట్లాడుకోవాలి. ఇక్కడ తండ్రి తెలివైన వాడు, కొడుకు కూడా తెలివైన వాడే. ప్రస్తుతం ఓ తండ్రిగా, ఒకప్పుడు కొడుగ్గా నాకున్న అభిప్రాయాలే మీకూ ఉన్నాయి. అంటే తండ్రి కొడుకుల అభిప్రాయాలు ఒక్కలాగే ఉంటాయని కాదు. యవ్వనంలో ఒక విషయం మీద తీక్షణంగా లగ్నమైన మనస్సు లోంచి, వయసు మీరిన వారి ప్రశాంత వివేకం ఆవిర్భవిస్తుంది.
ఉత్తరం చివర్లో మీరు అడిగిన దానికి కచ్చితంగా సమాధానం చెప్పాలంటే -
ప్రశ్న: మనం కాగోరుతున్నది కావాలంటే ఎలాంటి శిక్షణ పొందాలి?
జవాబు: రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు. నేను ఎన్నుకున్న మార్గం, మీ వాడు ఎన్నుకున్నదే. మీకు బాగా నచ్చిన విషయాలలో వీలైనంతగా శ్రమించాలి. అయితే మిగతా సబ్జెక్ట్ లలో మార్కులు సున్నాకి దిగకుండా జాగ్రత్త పడాలి. "ఏం కావాలి" అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. "ఏం చెయ్యాలి" అన్నదాని మీదే మనసు పెట్టాలి. మీ అబ్బాయికి ఆ విషయం ఇప్పటికే బాగా తెలిసినట్టుంది.
ప్ర: ఓ పదహారేళ్ల కుర్రాడు ఒక్క క్షణం ఆగి తన భవిష్యత్తు గురించి ఆలోచించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి?
జ: ప్రత్యేకించి ఏమీ లేదనుకుంటాను. కావలిస్తే ఓ చక్కని చుక్కని చూసుకుని పీకల్దాకా ప్రేమలో పడమనండి. రాత్రంతా తెల్లారేవరకూ ఇద్దర్నీ ఎవేవో ఊసులాడుకోమనండి. ఏం మహత్యం జరుగుతుందో మీరే చూడండి!
కనుక తండ్రిగారూ, ఏం భయపడకండి. మీ పిల్లవాడు చాలా తెలివైన వాడు. జీవితంలో పైకొస్తాడు.
అచ్చం అలాంటి మరో పిల్లాడి తండ్రిగా,
ఇట్లు
రిచర్డ్ పి. ఫెయిన్మన్
Good post. Thanks
Jayaho
Very inspiring, convinsing thoughts explained in a very causual, jovial way.Good posts. Keep posting.
very nice post! inspiring one.