తెలుగులో వైజ్ఞానిక సాహిత్యం చదవడం అలవాటు ఉన్నవారికి డా. మహీధర నళినీమోహన్ పేరు తెలియకుండా ఉండదు.
ఆయన రాసిన ’కాలెండర్ కథ’ అనే పుస్తకంలో భారతీయ ఖగోళశాస్త్ర చరిత్ర గురించే కాక భారతీయేతర నాగరికతలకి చెందిన ఖగోళ విజ్ఞానం గురించి, ఈ వివిధ ఖగోళసాంప్రదాయాల మధ్య పోలికల గురించి, తేడాల గురించి అద్భుతంగా వివరించారు.
ఆ పుస్తకంలో ’భూమి - బొంగరం’ అనే ఆరవ అధ్యాయంలో భూమి యొక్క "విషువచ్చలనం" గురించి ఓ మహా ఆసక్తికరమైన కథ ఉంది. దాన్ని సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.
---
భూమి తన చుట్టూ తాను 23 గం 56 నిముషాలకి ఒకసారి తిరిగినప్పుడు, ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక చుట్టు చుట్టినట్టు కనిపిస్తాయి. కాని ఒక్క నక్షత్రం మాత్రం కదలకుండా ఉన్నట్టు ఉంటుంది. అదే ధృవతార అని మనకి తెలుసు. అది కదలకపోవడానికి కారణం భూమి యొక్క అక్షం దాని లోంచి పోవడమే.
అయితే భూమి యొక్క అక్షం ఎప్పుడూ స్థిరంగా ఒకే దిశలో తిరిగి ఉండదు. దాని అక్షం చుట్టూ గిర్రున తిరిగే బొంగరం యొక్క అక్షం కూడా మెల్లగా మరో అక్షం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టే (దీన్నే precession అంటారు), భూమి యొక్క అక్షం కూడా మెల్లగా జరుగుతూ ఉంటుంది. భూమి అక్షం యొక్క ఈ చలనానికే "విషువచ్చలనం" (విషువత్ + చలనం) అని పేరు. ఆ చలనం ఎంత నెమ్మదిగా ఉంటుందంటే అది 1 డిగ్రీ జరగడానికి రమారమి 72 ఏళ్లు పడుతుంది. అలా జరుగుతూ మొత్తం ఒక చుట్టు చుట్టడానికి 25,800 సంవత్సరాలు పడుతుంది.
అంటే ప్రస్తుతం మనకి ’ధృవ’ నక్షత్రంగా ఉన్న నక్షత్రం ఎప్పుడూ మనకి ధృవ నక్షత్రంగా ఉండబోదన్నమాట. గతంలో మనకి అభిజిత్ (Vega) నక్షత్రం ధృవనక్షత్రంగా ఉండేదని ఇంతకు ముందు ఒక పోస్ట్ లో చెప్పుకున్నాం. క్రీ.పూ. 12,000 కాలంలో ఈ అభిజిత్ మనకి ధృవతారగా ఉండేది. మళ్లీ క్రీ.శ. 14,000 లో ఆ పదవిని ఆక్రమించబోతోంది.
క్రీ.పూ.2900 ప్రాంతంలో ఈజిప్షియన్లు పిరమిడ్లు నిర్మిస్తున్న కాలంలో, తూబాన్ (Alpha Draconis) అనే నక్షత్రం ధృవతారగా ఉండేదట.
అలాగే ప్రస్తుతం మనకి ధృవతారగా ఉన్న తార కూడా కచ్చితంగా భూ అక్షం మీద లేదు. భూ అక్షానికి సుమారు 1 డిగ్రీ పక్కగా ఉంది. ఫిబ్రవరి 2102 కల్లా భూ అక్షానికి అత్యంత దగ్గరగా వస్తుంది.
భవిష్యత్తులో సెఫియస్, ఆ తరువాత సిగ్నస్ మనకి ధృవతారలు అవుతాయి.
అయితే ఈ ఖగోళ విషయానికి ధృవుడి గురించిన పురాణ కథకి ఏంటి సంబంధం?
ధృవుడి కథలో విష్ణు మూర్తి ధృవుడికి ప్రత్యక్షమై "సప్తర్షులు నీ చుట్టూ 26 వేల సంవత్సరాల పాటు ప్రదక్షణ చేస్తూ ఉంటారు," అని వరం ఇచ్చాడట. నిజంగానే మరి భూమి అక్షం 26 వేలకి ఒకసారి ధృవతార నుండి దూరమై తిరిగి వచ్చినప్పుడు, ఆ తార చుట్టు సప్తర్షి మండలం ఒక చుట్టు చుడుతుంది.
అంటే పురాణ కాలం నాటీకే మన వాళ్లకి ఈ విషువచ్చలనం గురించి తెలుసా?
క్రీ.శ. 505 లో "పంచ సిద్ధాంతిక" వ్రాసిన వరాహమిహిరుడు, క్రీ.శ. 932 లో "లఘుమానసం" వ్రాసిన ముంజాలుడు ఈ విషువచ్చలనాలని గుర్తించినట్టు దాఖలాలు ఉన్నాయి. అయితే ఆ తరువాత మరి ఎందుచేతనో మన ఖగోళ సంబంధిత రచనలలో ఆ ఊసు రాలేదు.
http://en.wikipedia.org/wiki/Pole_star
---
(ఈ ఒక్క విషయమే కాదు. కొద్ది శతాబ్దాల క్రితం ఆరంభమైన ’ఆధునిక యుగ’ మొదలయ్యే సరికి అపారమైన ప్రాచీన భారత విజ్ఞానం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఎందుకు మాయమైపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కాదు... )
చాలా మంచి విషయం చెప్పారు. కృతజ్ఞతలు. మన ప్రాచీన విజ్ఞానం ప్రస్తుతం కనిపించకపోవడానికి కారణం ప్రధానంగా మనలను పాలించిన విదేశీయులతో పాటు మన నిర్లక్ష్యం మరియు ఇతరుల అనుకరణలో మన విజ్ఞానాన్ని మనం చులకనగాచూస్తూ కనీసం పట్టించుకోకపోవడం అని అనుకుంటున్నాను. మన ప్రభుత్వాలు దూరదృష్టి లేక ఇంగ్లీష్ ను సంధాన భాషగా పెట్టి సంస్కృతాన్ని అసలు మరిచిపోయేలా చేయడం.
ప్రాచీన భారత విఙ్ఞానం ఆవిరైపోలేదు. ఇప్పటికీ ప్రకృతిలో నిక్షిప్తమై ఉంది. అయితే మన ఆచరణ రూపాంతరం చెందింది. అప్పటి ప్రజలు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో, దీక్ష వ్రతములతో ప్రకృతిని ఆరాధించేవారు. తత్ఫలితంగా వారి జీవనవిధానం అన్ని కోణాలలోనూ ఆదర్శప్రాయం, ఆచరణీయం అయ్యింది. విదేశీయుల దండయాత్రలు, వారితో సహజీవనంతో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మనం మన
సంస్కృతీ సాంప్రదాయాలకు దూరమై, ప్రాచీన విఙ్ఞానాన్ని పక్కనపెట్టాము. ఉదాహరణకు ఉదయం లేవగానే మనం పళ్ళు తోముకుంటాము. దీనికోసం మన పూర్వీకులు వేప, ముషిడి, కానుగ, కంబ, మామిడి మొదలైన చెట్ల నుంచి తీసిన పుల్లలు వాడేవారు. వేప లేదా ముషిడి పుల్లతో దంతధావనం చేస్తే జబ్బులు వచ్చేవి కావు. ఇప్పటికీ వేప, మామిడి పుల్లలు దొరుకుతున్నా మనం పేస్టు వాడుతాము. వేప పుల్ల విఙ్ఞానం ఆవిరై ఎక్కడికీ పోలేదు, మనం వేపపుల్ల వాడటం మానేసాము. పారే నీటిలో స్నానం చేసేవారు అదికూడా సూర్యోదయాత్‌పూర్వమే, ప్రస్థుత పరిస్థితి ఎలాఉంది? ఇలా ఉదహరించుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
--వాసుబాబు.
Please read this book: The case for India by Will Durant. And also read this book review here: http://pustakam.net/?p=983. Up to 1820 our country is the richest in this world. ఈ పుస్తకంలో అన్నీ లెక్కలతో సహా ఉన్నాయి. 1820 తర్వాతే, మనవాళ్ళు మన విజ్ఞానాన్ని మర్చిపోయారు.
మన ప్రాచీన విజ్ఞానాన్ని తప్పకుండా ఈ తరం భారతీయులు క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ దిశలో ఇప్పటికే చాలా కృషి జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
అయితే మన ప్రాచీన శాస్త్రాలలో మూల భావనలకి, ఆధునిక విజ్ఞానంలో మూల భావనలకి ఎక్కడా పొంతన కుదరదు. ఉదాహరణకి ’పంచభూతాలు’, ’తన్మాత్రలు’ మొదలైన భావాలకి ఆధునిక విజ్ఞానం ఎక్కడా స్థానం లేదు. అసలు అలాంటి భావనలకి ఎలా స్థానం కల్పించాలో కూడా అర్థం కాదు. ప్రాచీన పద్ధతులని ఏదో ముక్కున పట్టి ఆచరించొచ్చు. కాని మన ప్రాచీన విజ్ఞానాన్ని వర్తమాన తరం పూర్తిగా కైవసం చేసుకోవాలంటే, ఆ మూల భావనల స్థాయిలో అవగాహన సాధించాలి.
మరో విషయం... గతానికి చెందినదంతా శ్రేష్ఠమైనదని అనేయలేం. ప్రతీ విషయాన్ని case by case చూసి, క్షుణ్ణంగా పరిశీలించాకనే, పరీక్షించాకనే దాన్ని ఒప్పుకోవాలి. లేకపోతే మన పూర్వీకులు చెప్పిందే వేదం అని నమ్మే ఛాందసత్వానికి దిగజారే ప్రమాదం ఉంది. శాస్త్రీయత ఛాందసత్వానికి వ్యతిరేకం. పాశ్చాతుల భావాలని గుడ్డిగా నమ్మడం ఒక రకమైన దాస్యం అయితే, మన పూర్వీకుల భావాలని గుడ్డిగా, నిర్విమర్శగా నమ్మడం కూడా మరో విధమైన బానిసత్వమే.
పాశ్చాత్యమైనా, భారతీయమైనా, గతమైనా, వర్తమానమైనా, తెలుగైనా, ఇంగ్లీషైనా - అది నిజమైనదా, విలువైనదా, శ్రేయస్కరమైనదా అన్నదే ప్రధానం.