అచేతన పట్ల ఒక
అవగాహన – కార్ల్ యుంగ్
భావాలని వ్యక్తం
చెయ్యడానికి మనిషి భాష వాడుతాడు. భాషతో పాటు ఎన్నో చిత్రాలను, ఆకృతులని భావవ్యక్తీకరణ
కోసం వాడడం జరుగుతుంది. మూడు గీతలు ఒక బిందువులో కలిసినట్టు ఉండే ‘మెర్సిడెస్’ కారు
కంపెనీ చిహ్నం గాని, ఐదు వృత్తాలు కలిసినట్టు ఉండే ఒలింపిక్స్ చిహ్నం ఆ కోవకి చెందినవే. అవి ఒక వస్తువుకి,
లేదా భావనకి దృశ్యరూపాలు. United Nations అనే
పదావళికి ఏ విధంగా UN అనేది సంక్షిప్త రూపమో, అదే విధంగా పైన చెప్పుకున్న
చిహ్నాలు (signs) ఒక కంపెనీనో, ఒక సంస్థనో, వస్తువునో సూచించే సంక్షిప్త చిహ్నాలు.
అవి ప్రతీకలు (symbols) కావు. ‘ప్రతీక’ అన్న పదాన్ని నేను పూర్తిగా భిన్నమైన రీతిలో,
ఒక ప్రత్యేక అర్థంతో వాడుతున్నాను.
ప్రతీక అనేది
ఒక పదం కావచ్చు, ఓ చిత్రం కావచ్చు. దానికి సామాన్య వ్యావహారిక ప్రపంచంలో ఓ అర్థం, ఓ
బాహ్యార్థం ఉంటుంది. అది కాకుండా ఆ పదానికి,
లేదా చిత్రానికి మరో రహస్యమైన, గూడార్థం కూడా ఉంటుంది. గ్రీకు దేశంలో క్రీట్ (Crete) ప్రాంతానికి చెందిన
స్మారక చిహ్నాలనే తీసుకుంటే ఎన్నో సందర్భాలలో మనకి బాడిస (adze) అనే చిహ్నం కనిపిస్తుంది.
ఇది మనకి బాగా తెలిసిన ఓ సామాన్య పనిముట్టు. కాని ఆ వస్తువు ఈ సందర్భంలో మరేదో వాస్తవానికి
ప్రతీకగా నిలుస్తోంది.
అలాగే నాకు తెలిసిన
ఓ భారతీయుడు ఒక సారి ఇంగ్లండు సందర్శించి తిరిగి ఇండియాకి వెళ్లి ఇంగ్లండులో మనుషులు
జంతువులని పూజిస్తారని చెప్పాడు. ఎందుకంటే అతగాడు ఇంగ్లండ్ లో ఎన్నో పాతకాలపు చర్చిలలో డేగలు, సింహాలు, ఎద్దులు మొదలైన జంతువుల బొమ్మలు
చూశాడు. అతడికి తెలియనిది ఏంటంటే ఈ జంతువులు
ఎవాంజెలిస్ట్ లకి ప్రతీకలు. క్రైస్తవ సాంప్రదాయంలో ఎవాంజెలిస్ట్ లు నలుగురు. వాళ్లు
– మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్ లు. వీరిలో మాథ్యూ ని మానవ రూపంలోను, మార్క్ ని సింహం
రూపంలోను, ల్యూక్ ని ఎద్దు రూపం లోను, జాన్ ని డేగ రూపం లోను వ్యక్తం చెయ్యడం పరిపాటి.
ఇంచుమించు ఇదే విధంగా జంతువులని ప్రతీకలుగా వాడే మరో తార్కాణం మనకి ఈజిప్షియన్ సంస్కృతిలో
ఒక చోట తారసపడుతుంది. ఈజిప్షియన్ల సూర్య భగవానుడి పేరు హోరస్ (Horus). అతడికి నలుగురు
కొడుకులు. వాళ్లు – ఇమ్సెటీ, హాపీ, డ్యుయాముటెఫ్, కెబెసెన్యుయెఫ్ లు. వీరిలో ఇమ్సెటీని
మానవ రూపంలోను, హాపీని కొండముచ్చు రూపంలోను, డ్యుయాముటెఫ్ ని తోడేలు రూపం లోను, కెబెసెన్యుయెఫ్
ని డేగ రూపంలోను వ్యక్తం చేస్తారు. దీన్ని బట్టి నాలుగు జంతు రూపాల కూటమి అనేది ఒక
విధమైన విశ్వజనీన ప్రతీక కావచ్చని అనిపిస్తోంది.
అలాగే ప్రపంచంలో
ఎన్నో చోట్ల చక్రం, శిలువ మొదలైన ప్రతీకలు కనిపిస్తాయి. సందర్భాన్ని బట్టి, సంస్కృతిని
బట్టి ఈ ప్రతీకలకి ఏదో గూడార్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటి అన్న దగ్గర కొన్ని చోట్ల వివాదం
తలెత్తుతూ ఉంటుంది. ఏదేమైనా ఓ స్థూలార్థం, ఓ గూడార్థం ఉన్న వాటినే ప్రతీకలు అంటాము.
కనుక బాహ్యార్థం
కన్నా లోతైన అంతరార్థాన్ని సూచించే ఏ పదాన్నయినా, చిత్రాన్నయినా మనం ప్రతీక అంటున్నాం.
అలాంటి ప్రతీకకి మరింత విశాలమైన, “అచేతనమైన”
పార్శ్వం ఉంటుంది. ఆ ముఖాన్ని ఎవరూ స్పష్టంగా నిర్వచించలేరు, వర్ణించలేరు. మనిషి
మనస్సు ప్రతీక యొక్క అంతరార్థాన్ని శోధిస్తూ లోతుగా పోతున్నప్పుడు కొన్ని సార్లు హేతువుకి
అందని తలాలలోకి ప్రవేశించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఉదాహరణకి చక్రాన్ని చూడగానే మన మనసులో
“దివ్యమైన” సూర్యుడు అన్న భావనకి చెందిన ఆలోచనలు మెదలవచ్చు. ఇక్కడ మనసు యొక్క పరిమితులు
బయటబడతాయి. “దివ్యం” అంటే ఏంటో నిర్వచించడం కష్టం. ఒక దాన్ని మనం “దివ్యం” అన్నప్పుడు
దానికి ఊరికే ఏదో పేరు పెడుతున్నాం. ఓ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంతే గాని అది
బాహ్య ఆధారాల మీద, అనుభవం మీద ఆధారపడ్డ విషయం కాదు.
మనిషి అవగాహనకి
అందని విషయాలు ఎన్నో వున్నాయి. కొన్ని సార్లు మనిషి తన అవగాహనకి అందని, తనకి కచ్చితంగా
అర్థం కాని విషయాలని అర్థం చేసుకోడానికి ప్రతీకలు వాడుతాడు. మత సాంప్రదాయాలు అందుకే
ప్రతీకలని, చిత్రాలని విరివిగా వాడుతాయి. ఇలా సచేతనంగా ప్రతీకలని వాడే సాంప్రదాయం ఎప్పట్నుంచో
ఉంది. కాని విశేషం ఏంటంటే కొన్ని సార్లు మనిషి అచేతనంగా, అప్రయత్నంగా, తన కలలలో కొన్ని
ప్రతీకలని ఎదుర్కొంటాడు.
ఈ విషయాన్ని
అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మనిషి కలలలో ప్రతీకలు కనిపించడం ఏంటి? ఇది అర్థం కావాలంటే
మనిషి మనసు పని చేసే తీరుని ఒక సారి గమనించాలి. ఇంద్రియాల ద్వార మనం బాహ్య ప్రపంచం
గురించి తెలుసుకుంటాం. ఇంద్రియాల సాక్ష్యం మేరకు బాహ్య ప్రపంచం గురించి ఒక అవగాహన కల్పించుకుంటాం.
అయితే ఇంద్రియాల సామర్థ్యం అందరిలో ఒకేలా ఉండదు. కొందరికి నిశిత దృష్టి ఉంటుంది. ఒక్కసారి
చూస్తే ఎన్నో వివరాలు గ్రహిస్తారు. మరి కొందరు ఎంత సేపు చూసినా ఎన్నో వివరాలు గుర్తించలేకపోతారు.
కనుక ఇంద్రియాలు ఒక్కటే అయినే మనం గ్రహించే సారంలో ఎంతో వైవిధ్యం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఇంద్రియాలు
బాహ్య ప్రపంచం యొక్క మన అవగాహనకి పరిమితులు ఏర్పరుస్తాయని కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే వైజ్ఞానిక పరికరాలు వాడుకోవచ్చు. ఓ టెలిస్కోప్
తో దూరంగా ఉన్నవి చూడగలం. ఓ ఆంప్లిఫయర్ వాడి బలహీనమైన శబ్దాలని సంవర్ధనం చేసి వినగలం. అలా మన ఇంద్రియాల సామర్థ్యాన్ని కొంత మేరకు విస్తరింపజేసుకున్నా,
ఒక దశలో ఆ ప్రక్రియకి కూడా హద్దులు కనిపించక మానవు. ఆ విధంగా మన ఇంద్రియాల సామర్థ్యంలోని
పరిమితుల వల్ల మన ఎరుకకి పరిమితులు ఏర్పడతాయి.
మన ఎరుకకి లేదా
చేతనకి మరో విధమైన పరిమితులు కూడా ఉంటాయి. మన అంతర్యంలో జరిగే కొన్ని సంఘటనలు అన్నీ
మన సచేతనమైన స్పృహలోకి రావాలని లేదు. కొన్ని సంఘటనలు మన సచేతన మనస్సు అనే స్థాయి కన్నా
కాస్త కిందుగా అంటే అచేతనంగా జరిగిపోతాయి.
గొప్ప లోదృష్టి చేతనే అవి జరిగినట్టు తెలుసుకోగలం. మొదట్లో వాటి ప్రాముఖ్యతని
మనం గుర్తించలేకపోయినా, అచేతన అనే చీకటి ప్రాంతం నుండి అవి కొన్ని సార్లు తదనంతరం పైకి
తేలి మన సచేతన మనసులోకి ప్రవేశిస్తాయి.
కొన్ని సార్లు
అలాంటి ఎరుక మనకి కలలలో సంభవిస్తుంది. సామాన్యంగా ఆంతరిక విషయాలలో అచేతనమైనది ఏదైనా
ఉంటే అది మనకి కలలలో తేటతెల్లం అవుతుంది. అలా తేటతెల్లం అయిన విషయం తార్కికమైన భాషా
రూపంలో ఉండదు. చిత్రాల రూపంలో, ప్రతీకల రూపంలో ఉంటుంది. అసలు మనకి చరిత్ర వల్ల తెలిసేదేమంటే
అచేతన గురించి మన అవగాహన మొట్టమొదట స్వప్నాల అధ్యయనం వల్లనే తెలిసింది.
(ఇంకా వుంది)
1 Responses to అచేతన పట్ల ఒక అవగాహన – కార్ల్ యుంగ్